చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోనే జానియర్ కళాశాల కూడా ఉంది.కొంతమంది ఇంటర్ విద్యార్థులు క్రీడా మైదానం ఆవరణలో గంజాయి సేవిస్తున్నట్లు గురువారం మీడియాకు సమాచారం అందింది. దీంతో అక్కడికెళ్ళి పరిశీలించగా కొంతమంది విద్యార్థులు ప్రహరీ గోడ వెనుకవైపు కూర్చొని గంజాయి సేవిస్తూ కంటపడ్డారు. మీడియా సిబ్బందిని గమనించి గోడదూకి పరారయ్యారు. పరిశీలించగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో పాటు మద్యం సీసాలు, గుట్కా, హాన్స్ ప్యాకెట్లు కన్పించాయి.ఈ మైదానం పక్కనే బాలికల హాస్టల్ ఉంది.గంజాయి, మద్యం సేవించిన విద్యార్థులు హాస్టల్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, కళాశాల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని చాలాకాలంగా విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో కూడా గంజాయి విక్రయాలు జోరుగా నడుస్తున్నాయి.చాలామంది యువకులు గంజాయి మత్తుకు బానిసలయ్యారు. చంద్రగిరిలోనే గతంలో ఓ బాలికకు వైసీపీ కార్యకర్త షాపులో గంజాయి సిగరెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి.తరువాత సీఐ ఓబులేసు మత్తు పదార్థాలపై పలుమార్లు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మళ్ళీ గంజాయి విక్రయాలు వెలుగులోకి రావడంతో ఇకపై గట్టి నిఘా పెడతామని తెలిపారు.