ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వీడియో స్పందించిన టీటీడీ.. ఉద్దేశపూర్వకంగా చేశారని క్లారిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 09:14 PM

అన్నదాన ప్రసాదం నాసిరకం అని కొందరు చేసిన వీడియో ఉద్దేశపూర్వకంగా చేశారని టీటీడీ వెల్లడించింది. ఇదిలలావుంటే తిరుమల శ్రీవారి నిత్యాన్నదానంలో నాసిరకం భోజనం అంటూ ఓ వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంపై రాధామోహన్ దాస్ అనే భక్తుడు దురుద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని ఈవో ఖండించారు.. అన్నప్రసాదం చాలా బాగా ఉందని పలువురు భక్తులు చెప్పిన వీడియోను ప్రదర్శించారు. అన్నప్రసాద కేంద్రంలో ఉపయోగించే బియ్యం ఇతర సరుకులు కూరగాయలు వివిధ దశల్లో క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతే వంటకు ఉపయోగిస్తున్నామన్నారు. టీటీడీ మీద రాధామోహన్ దాస్ చేసిన దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు.


శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రిలో నెల రోజుల్లోనే రెండు గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించామన్నారు ఈవో ధర్మారెడ్డి. బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు. గుండె దానం చేయాలనుకునే వారు ముందుగా టీటీడీ కి తెలియజేస్తే వైద్యబృందం సకాలంలో వచ్చి గుండె సేకరించి దాన్ని మరో బాలుడు లేదా బాలికకు అమర్చి వారి ప్రాణాలు కాపాడటం జరుగుతుందన్నారు.


తిరుమలలో గదుల కేటాయింపు, డిపాజిట్ తిరిగి చెల్లింపు ప్రక్రియలో మార్చి 1 నుండి ప్రయోగాత్మకంగా ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వినియోగిస్తున్నామన్నారు. దీనివల్ల దళారీల బెడద దాదాపుగా తొలగిందని.. సర్వదర్శనం భక్తులకు వైకుంఠం రెండో క్యూ కాంప్లెక్స్‌లో కూడా ఈ పరిజ్ఞానం ఉపయోగిస్తామన్నారు. దీనివల్ల ఉచిత లడ్డూల పంపిణీలో అవకతవకలు జరక్కుండా నిరోధించవచ్చన్నారు. తిరుమలలోని గోకులం కార్యాలయంలో శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించామని.. భక్తులు నేరుగా తమ ఆధార్‌ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారన్నారు. దీనివల్ల దళారుల బెడద పూర్తిగా తొలగుతుందన్నారు.


తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు పాదరక్షలు భద్రపరుచుకునేందుకు వీలుగా ఏప్రిల్‌ రెండవ వారంలో 11 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం.. 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం నిర్వహిస్తారన్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్‌ 5న శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుందని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు.


పుట్టుకతోనే చెవుడు మూగతో బాధపడేవారికి బర్డ్‌లో స్మైల్‌ ట్రైన్‌ సంస్థ సహకారంతో ఉచితంగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేస్తున్నామన్నారు. రూ.20 లక్షల వ్యయమయ్యే ఈ ఆపరేషన్‌ ఉచితంగా నిర్వహించి చెవుడు మూగ సమస్యల నుంచి వారికి విముక్తి కల్పించి కొత్త జీవితాన్ని అందిస్తున్నామన్నారు. బర్డ్‌ ఆసుపత్రిలో ఏ వయసువారికైనా ఉచితంగా గ్రహణమొర్రి ఆపరేషన్లు నిర్వహించి వారు స్పష్టంగా మాట్లాడగలిగేలా చేస్తున్నామన్నారు. 5 నెలల్లో 50 ఆపరేషన్లు నిర్వహించామన్నారు. రూ.2 లక్షలు ఖర్చు అయ్యే ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేయడంతోపాటు వారికి రవాణా ఖర్చులు, పోషకాహారం తీసుకునేందుకు సహాయం చేస్తున్నామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa