చైనాపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీకి సిద్ధమైన భారత సంతతి మహిళ నిక్కీ హేలీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రిపబ్లికన్ పార్టీ వార్షిక మితవాద రాజకీయ కార్యాచరణ సమావేశాన్ని ఉద్దేశించి హోలీ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. అమెరికా ఇంతవరకు ఎదుర్కొన్న శత్రువుల్లోకెల్లా అత్యంత బలమైన, క్రమశిక్షణాయుతమైన ప్రత్యర్థి చైనాయేనని వ్యాఖ్యానించారు. అమెరికా, కెనడాలపై వారం రోజులపాటు ఎగిరిన తరవాతే చైనా బెలూన్‌ను కూల్చివేశారని, ఇది జాతికి ఇబ్బందికరమైన పరిణామని మండిపడ్డారు.
‘‘చైనా గూఢచారి బెలూన్ మన గగనతలంలో ఎగరడం అమెరికన్లు చూస్తారని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. ఇది జాతీయ స్థాయిలో అవమానంగా మారింది’’ అని హేలీ మండిపడ్డారు. అమెరికాకు ఫెంటానిల్ అనే మత్తు పదార్థాన్ని అక్రమంగా పంపుతున్న చైనా అన్ని డ్రగ్స్ ముఠాల కంటే అత్యంత ప్రమాదకరమైందని ఆరోపించారు. కోవిడ్-19తో మొదలు అనేక సమస్యలకు చైనాను జవాబుదారీ చేయాలని హేలీ డిమాండ్ చేశారు. చైనాలోని వుహాన్ నగరం హువానాన్ మార్కెట్ నుంచి కరోనా కారక సార్స్ కోవ్ 2 వైరస్ ప్రపంచమంతటికీ వ్యాపించిందని ధ్వజమెత్తారు.
అమెరికాలో చైనా కంపెనీలు 3,80,000 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నాయని, ఆ భూముల్లో కొన్ని అమెరికా సైనిక స్థావరాల పక్కనే ఉన్నాయని గుర్తు చేశారు. బైడెన్ ప్రభుత్వం దీన్ని సాగనివ్వడం తనకు నమ్మశక్యంగా లేదన్నారు. అమెరికా విశ్వవిద్యాలయాలు మన నిధులను తీసుకుంటాయో.. చైనా నిధులను తీసుకుంటాయో తేల్చుకోవాలనీ, రెండు దేశాల నుంచీ లబ్ది పొందుతామంటే కుదరదని స్పష్టం చేశారు. డెమొక్రాట్ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా అప్పుల భారం 31 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందనీ, వచ్చే పదేళ్లలో మరో 20 లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పులు చేయబోతున్నారని విమర్శించారు.
దక్షిణ కరోలినాకు రెండుసార్లు గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హోలీ.. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయభారిగానూ ట్రంప్ హయాంలో నియమితులయ్యారు. తానే వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తానని గత నెలలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. రిపబ్లికన్‌ల మద్దతుకోసం ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరో భారతీయ సంతతి వ్యక్తి వివేక్ రామస్వామితో హేలీ తలపడనున్నారు.
‘నేను సోషలిజంవైపు ప్రయాణిస్తోన్న అమెరికా ఆపడానికి, దేశంలోసుకున్న స్వీయ-ద్వేషాన్ని అంతం చేయడానికి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను.. బలమైన, గర్వించదగిన అమెరికాను పునరుద్ధరించడానికి నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను.. నేను భవిష్యత్తును చూసినప్పుడు మన దేశం స్వేచ్ఛ, అవకాశాలతో పునర్నిర్మించబడింది.. కానీ వర్తమానంలో నేను దీనికి విరుద్ధమైంది చూస్తున్నాను. జో బైడెన్, డెమొక్రాట్లు అణచివేత, పేదరికం, చట్టవిరుద్ధమైనవి మనకు ఇస్తున్నారు’’ అని హేలీ బైడెన్ యంత్రాంగంపై విమర్శలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa