నేటి ఆధునిక సమాజంలోనూ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న గురువులందరూ అభినందనీయులని, నేటి యువత సాంప్రదాయ కళల పట్ల ఆసక్తి చూపాలని పలువురు వక్తలు అన్నారు. జ్యోతిర్మయి దేవాంగ సమితి ఆధ్వర్యంలో మండలంలోని దేశాయిపేట ప్రధాన కూడలిలో సాంప్రదాయ కళలైన రామలింగ చౌడేశ్వరీ ఆలయాల నిర్వహణ, పౌరోహిత్యం, దండకం, భజన, కర్రసాము, కోలాటం, కుస్తీ, బాక్సింగ్, అలుగుసేవ వంటి వాటిని భవిష్యత్ తరాలకు నేర్పుతూ భవష్యత్ తరాలకు అందిస్తున్న గురువులను మంగళవారం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేటి యువత చదువుతో పాటు సాంప్రదాయ కళలను నేర్చుకోవాలని, వాటి ద్వారా ఆత్మ రక్షణ, వ్యాయామం, దేహ ధారుఢ్యం, ఆత్మ సంతృప్తితో పాటు మానసికోల్లాసం, ప్రశాంతత ఏర్పడతాయని అన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు డాక్టర్ గౌరాబత్తుని రవిబాబు, విశ్వంభరానందగిరి స్వామి, గౌరవాధ్యక్షులు కొసనం నాగమాంబ, గౌరవ సలహాదారులు గుళ్ళాపల్లి షణ్ముఖరావు, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు బుద్ధి సుధాకర్, కమిటీ సభ్యులు, దేశాయిపేట గ్రామ కమిటీ ప్రతినిధులు, నియోజకవర్గంలోని దేవాంగ సామాజిక ప్రజలు పాల్గొన్నారు.