మైదుకూరు నియోజకవర్గం లో పసుపు, పత్తి పంట లకు ధర ఉంటే రైతులు ఆనందంగా ఉంటారు. నీటి తడులతో పసుపు పంట పండితే, ఆరుతడి పంటగా పత్తి పంట పండుతుంది. ఈ రెండింటికి ధర పుష్కలం గా ఉంటే రైతులు ఆనందంగా ఉంటారు. ఈ రెండు పంటల దిగుబడి తగ్గితే దానికి తోడు ధరలు పతనంతో రైతుల పరిస్థితి వర్ణనాతీతం. ఇదే పరిస్థితి పత్తి రైతులకు ఎదురయ్యింది. వివరాలకు వెళితే. ఖాజీపేట మండలంలో దాదాపు 6వేల ఎకరాలకు పైగా పత్తి పంటను రైతులు సాగు చేశారు. అయితే అకాల వర్షాలు, పకృతి ప్రభావంతో కాపు వచ్చే దశలో పంట నిలువునా ఎండిపోయింది. కాస్త కోస్తూ పండిన పంట ఎకరాకు రెండు, మూడు క్వింటాలు వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. ఎకరాకు 35 వేల రూపాయల పెట్టుబడి వచ్చిందని ప్రభుత్వం పత్తికి క్వింటా ధర 3080 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధరకు రైతులు అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం మద్దతు ధర పెంచి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.