ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మార్చి 9వ తేదీ నుంచి పిలుపిచ్చిన ఉద్యమ కార్యాచరణలో తాము పాల్గొనటం లేదని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి పేరుతో ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ వల్ల ఉద్యోగులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందన్నది ప్రశ్నగా ఉందని పేర్కొన్నారు. ఇంతకు ముందు విజయవాడలో నిర్వహించిన పీఆర్‌సీ ఉద్యమంలో ప్రతి ఉద్యోగి పాల్గొన్నాడని.. ఉద్యోగ సంఘాల తీరుతో ఏ ఉద్యోగికీ న్యాయం జరగలేదని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా 27 శాతం ఐఆర్ తీసుకుంటూ ఉంటే రివర్స్‌లో 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేకుండా పోయిందని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా అడగటం లేదని ఆక్షేపించారు. సొంత ప్రయోజనాల కోసం మళ్లీ ఉద్యోగులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వద్దకు అనేకసార్లు చర్చలకు వెళ్లినా పరిష్కారం చూపలేకపోయారని, ఇదిగో ఉద్యమం చేస్తున్నాం అనే నేతలను ఉద్యోగస్తులెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్ననరు. ఉద్యోగసంఘాల నేతలు ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కనకదుర్గమ్మ అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యపోరాటాలు చేస్తే తప్ప ఉద్యోగులకు న్యాయం జరగదని, ఐక్య కార్యాచరణ ఇస్తేనే తమ మద్దతు ఉంటుందని తెలిపారు.