వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2024) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమం అమలు చేయడంతో పాటు రూ.6 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసి... గృహ అవసరాలకు రూ.500లకే వంట గ్యాస్ సరఫరా చేస్తామని ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మెన డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. బుధవారం రాయచోటిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి శనిగ్రహాల్లా ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలు దాపురించాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ 3వ స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చేందుకు వ్యవసాయ రుణాలు మాఫీ, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.6వేలు అందజేస్తామన్నారు. ఇక రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలలో బుందేల్‌ఖండ్ తరహా అభివృద్ధి చేయడమే కాకుండా కడప స్టీల్‌ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రోజోన, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వేజోన సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో రాయచోటి కాంగ్రెస్ పార్టీ ఇనచార్జి అల్లాబకష్, ఖాదర్‌బాషా, చెన్నకృష్ణ, మహబూబ్‌బాషా, రమణమ్మ, ఎస్‌యండీ గౌస్, ఖాదర్‌ఖాన, జాఫర్, షఫీ తదితరులు పాల్గొన్నారు.