న్యూయార్క్ టైమ్స్ ట్టుకథలను ప్రచారం చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో పత్రిక స్వేచ్ఛ లేదంటూ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించింది. భారత్‌పై అబద్దాలను ప్రచారం చేస్తోందని అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యూయార్క్ టైమ్స్ కల్పితాలు, కట్టుకథలను భారతీయులు అనుమతించబోరని అన్నారు. భారత్ విషయంలో ఆ పత్రిక తటస్థ వైఖరిని ఎప్పుడో వదిలేసిందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. ఇలాంటి వాటిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ, ఇతర ప్రాథమిక హక్కుల మాదిరిగా పవిత్రమైందని వ్యాఖ్యానించారు.
కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన అభిప్రాయం పూర్తిగా కల్పితమని ఆయన కొట్టి పారేశారు. ‘‘భారత్ గురించి ఏదైనా ప్రచురించే విషయంలో న్యూయార్క్ టైమ్స్ చాలా కాలం కిందటే తటస్థతకు తిలోదకాలిచ్చింది.. కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛపై ఆ పత్రిక అభిప్రాయం కొంటెది.. కల్పితం.. భారతదేశం, ప్రజాస్వామ్య సంస్థలు, విలువల గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే దాని ఏకైన ఉద్దేశంగా కనిపిస్తోంది’ అని అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
‘న్యూయార్క్ టైమ్స్ సహా కొన్ని విదేశీ మీడియాలు భారతదేశం గురించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ గురించి అసత్యాలను ప్రచారం చేస్తున్నదానికి ఇది కొనసాగింపు.. అలాంటి అబద్ధాలు ఎక్కువ కాలం ఉండవు’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘ఇవాళ యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది.. కానీ సదరు పత్రికకు కన్పించక పోవడం విడ్డూరంగా ఉంది.. ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం మంచి పద్దతి కాదు.. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో స్పూర్తి దాయకమైన దేశంగా ముందుకు వెళుతోంది. ప్రత్యేకంగా భారత్, దాని ప్రజాస్వామ్య సంస్థల గురించి తప్పుడు ప్రచారం చేసేందుకే న్యూయార్క్ టైమ్స్ ఇలాంటి కథనం ప్రచురించింది’’ అని ఠాకూర్ ధ్వజమెత్తారు.
‘‘భారతదేశంపై పగ పెంచుకుంటున్న కొన్ని విదేశీ మీడియాలు.. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మన ప్రజాస్వామ్యం, బహుళత్వ సమాజం గురించి చాలా కాలం నుంచి అబద్ధాలను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ కేంద్ర మంత్రి మండిపడ్డారు. ‘‘భారత్ ప్రజాస్వామ్య దేశం.. ఇక్కడ ప్రజలు చాలా పరిణితి కలిగినవారు.. భారత్ వ్యతిరేక ఎజెండా కలిగిన అటువంటి మీడియా నుంచి ప్రజాస్వామ్యం వ్యాకరణం గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛపై తప్పుడు కూతలు కూస్తోందని ఆరోపించారు.