తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను తక్షణమే ప్రభుత్వం ఆపకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని వామపక్ష సిపిఐ, సిపిఎం పార్టీలు తీవ్రంగా హెచ్చరించాయి. శృంగవరపుకోట మండల కేంద్రంలో శుక్రవారం వామపక్ష సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపీఐ జిల్లా నాయకులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించాలని, పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ చెల్లించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం నిరంకుశ ధోరణి విడనాడాలని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు ఆపకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మధ్య కృష్ణ, మధు తదితర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.