మనదేశంలో నేటిి ప్రముఖ మహిళలెందరో చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యారు అన్న నమ్మలేని విషయాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తన ఎనిమిదో ఏట నుంచే కన్న తండ్రి లైంగిక వేధింపులకు గురిచేశాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ ఇటీవల చేసిన ప్రకటన సంచలనమైన విషయం తెలిసిందే. తాజాగా, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ కూడా తానూ కన్నతండ్రి చేతుల్లో వేధింపులకు గురయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి లైంగిక వేధింపులు భరించలేక, మంచం కింద దాక్కొన్న సందర్భాలు ఉన్నాయని నాటి పీడకలను ఆమె గుర్తుచేసుకున్నారు. నాలుగో తరగతి వరకు తనపై వేధింపులు కొనసాగాయని తెలిపారు.
శనివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘నా సొంత తండ్రే చిన్నతనంలో నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. 4వ తరగతి వరకు మేం ఆయనతో కలిసి ఉన్నాం. నన్ను ఆయన అకారణంగా కొట్టేవాడు.. జుట్టుపట్టుకుని తలను గోడకు గుద్దించేవాడు.. కొన్నిసార్లు తల నుంచి రక్తం కారేది.. ఆయన ఇంట్లోకి వస్తే.. భయమేసేది. ఎన్నోసార్లు మంచం కింద దాక్కున్నా’’ అని స్వాతి మాలివాల్ అన్నారు. పిల్లలను దోపిడీ చేసే పురుషులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.
ఒక వ్యక్తి చాలా అఘాయిత్యాలకు గురైనప్పుడు, ఇతరుల బాధను అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను.. అది మొత్తం వ్యవస్థను కదిలించే అగ్నిని మేల్కొల్పుతుందని చెప్పారు. ‘చిన్నతనంలో నేను ఎదుర్కొన్న వేధింపుల నుంచి బయటపడటానికి నాకు చాలా కాలం పట్టింది.. ఒక పిల్లలు వేధింపులకు గురైనప్పుడు అది వారికి జీవితాంతం మచ్చగా ఉంటుంది.. అది పీడకలలా వెంటాడుతుంది’ అని స్వాతి మలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా తాను కూడా బాధితురాలినేని, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే లైంగిక వేధింపులకు గురిచేయడం దారుణమని అన్నారు. 15 ఏళ్ల వయసు వచ్చాక అతడిని ఎదిరించడం మొదలుపెట్టినట్లు ఖుష్బూ వెల్లడించారు.