స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తాం, మూసేస్తాం అంటూ కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పంథాను మార్చి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నిర్ణయించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు 100శాతం కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై గురువారం పౌర గ్రంథాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ మాట్లాడుతూ, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేసిన శతశాతం వాటాల విక్రయ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్లమెంట్ సభ్యులకు, కేంద్ర స్టీల్ కన్సల్టేషన్ కమిటీ సభ్యులకు కమిటీ తరపున లేఖలు రాశామని చెప్పారు. మోడీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ బ్రీఅతీవేటీకరణ ప్రకటన చేసింది మొదలు 760 రోజులుగా కార్మికులు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా, పార్లమెంట్ సభ్యులు పార్లమెంటులో మోడీ సర్కార్‌ను నిలదీస్తున్నా, అమ్మేస్తాం , మూసేస్తాం అంటూ మొండిగా ప్రకటనలు చేస్తుండటంపై తమ కమిటీ ఆగ్రహం వ్యక్తంచేస్తోందన్నారు. పంథాను మార్చి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ కో-కన్వీనర్లు నీరుకొండ రామచంద్రరావు, జె. అయోధ్యరామ్, మస్తానప్ప, రమణారెడ్డి, వరసాల శ్రీనివాసరావు, పడాల రమణ, జె. రామకృష్ణ, దొమ్మేటి అప్పారావు పాల్గొన్నారు.