ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అంటూ, రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందే, కావాల్సిందే అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, ఇప్పటివరకు దానిపైన నోరు మెదపలేదు. ఐతే తాజాగా మళ్ళి హోదా అంశం తెరపైకి తీసుకువచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్, ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తెచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ మేరకు ప్రధానికి సీఎం వైయస్ జగ న్ విజ్ఞాపన పత్రం అందించారు.