కృత్రిమ వాతావరణంలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించే దిశగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు తీసుకుందని ఆ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఒక యువ వ్యవసాయ పట్టభద్రురాలు ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వును సాగు మొదలెట్టి తొలి ప్రయత్నంలోనే స్వచ్ఛమైన 200 గ్రాముల ఫస్ట్ గ్రేడ్ దిగుబడి సాధించిన విషయం మీ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిందా అని రాజ్యసభలో శుక్రవారం వైయస్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం వ్యవసాయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్ధిని ఒకరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తన ఇంట్లోనే హ్యుమిడిఫైర్స్ సాయంతో సెమి హైడ్రోపోనిక్స్ పరిస్థితులు సృష్టించి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. దానిని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేసారు.