ఉద్యోగాల పేరుతో మోసపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలకు చెందిన పలువురు విశాఖపట్నం, గాజువాక పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం మేరకు.. సౌదీలోని హది ఆల్ హమ్మమ్ కంపెనీలో ఫిట్టర్లు, ఎలక్ర్టీషియన్లు, కార్పెంటర్ల ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని గత ఏడాది జూలై 15న ఆటోనగర్‌లోని గ్రాండ్ వెల్డ్ సంస్థ ప్రకటన ఇచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాకు చెందిన వందల సంఖ్యలో నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో 76 మందిని ఎంపిక చేసి సౌదీలో రెండేళ్ల పాటు పని ఉంటుందని నమ్మబలికింది. అనంతరం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.60 వేల చొప్పున సంస్థ నిర్వాహకులు వసూలు చేశారు. అయితే, ఎంపికైన అభ్యర్థులకు కేవలం ఆరు నెలలకు మాత్రమే సంబంధిత విదేశీ కంపెనీ వీసా మంజురు చేసింది. ఈ మేరకు ఆగస్టు 21 నుంచి 25వ తేదీ మధ్య సౌదీ కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. అయితే వీసా గడువు పూర్తవ్వడంతో ఈ 76 మందిని తిరిగి వెనక్కి పంపేసింది. దీంతో బాధితులంతా ఆటోనగర్‌లోని గ్రాండ్ వెల్డ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి నిలదీశారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించిన రాజాబాబు అనే వ్యక్తి ఈ నెల 25లోగా రూ.30 వేల చొప్పున తిరిగి చెల్లిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాడు. ఈ మేరకు సోమవారం బాధితులంతా అతడిని కలిశారు. అయితే నగదు చెల్లించేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండని రాజాబాబు ఎదురుతిరగడమే కాకుండా ఒకరిపై చేయి చేసుకున్నట్టు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గాజువాక ఎస్‌ఐ సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.