జీవకోటి అనారోగ్యానికి కారణమైన వయ్యారి భామ కలుపు మొక్కలను నివారించి బావితరాల ఆరోగ్యాని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు కోరారు.
పార్థీనియం మొక్కల సామూహిక నిర్మూల కార్యక్రమంలో భాగంగా గురువారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి పార్థీనియం కలుపు మొక్కల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలను తొలగించి దగ్ధం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవకోటి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపడంతో పాటు పంటల ఎదుగుదలలో దుష్ఫలితాలను ఇస్తున్న పార్థీనియం వయ్యారి భామ కలుపు మొక్కలను నివారించి భావితరాల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సి ఉందన్నారు. 1950 దశకంలో ఇతర దేశాల నుండి గోధుమల దిగుమతుల ద్వారా పార్థీనియం కలుపు మొక్కల విత్తనాలు మన దేశానికి ప్రవేశించడం జరిగిందన్నారు. అప్పటి నుండి పంట పొలాలు బహిరంగ ప్రదేశాలు పాఠశాలలు, రహదారులకు ఇరువైపులు, చెరువుగట్ల వంటి ప్రదేశాలలో ఈ మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. పార్థీనియం కలుపు మొక్కలను వైట్ టాప్, నక్షిత్ర గడ్డి, కెరెక్ట్ మొక్క వయ్యారిభామ వంటి పేర్లతో పిలవడం జరుగుతుందన్నారు. పార్థీనియం మొక్క ఊపిరితిత్తులవ్యాధి, చర్మవ్యాధులు, జ్వరం వంటి బాధలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ప్రజలు కరోనా వైరస్ కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులకు గురైన నేపథ్యంలో కలుపు మొక్కలను నివారించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పశువుల ఆరోగ్యం, పంట ఎదుగుదలను నివారించడంలో పార్థీనియం కలుపు మొక్క దుష్పలితాలను చూపుతుందన్నారు. గతంలో ఇంగ్లీషు తుమ్మ చెట్లు ఎక్కడపడితే అక్కడ విపరీతంగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవన్నారు. వాటిని నిర్మూలించిన రీతిలో పార్థీనియం మొక్కలను కూడా నిర్మూలించాల్సిన భాధ్యత ఉందన్నారు. పార్థీనియం మొక్క ప్రభావాన్ని ప్రజలకు వివరించి మొక్క కనపడిన వెంటనే పెకిలించి వేయాలన్న ఆలోచన ప్రజలలో కల్పించగలిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కలుపు మొక్క నివారణ ఒక రోజుతో సాధ్యమయ్యేది కాదని ఒక సంవత్సరం కాలంపాటు ప్రతి వారం ఒక రోజు ప్రతి గ్రామం, పట్టణంలో ప్రభుత్వ అధికారులు సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు భాగస్వామ్యులు అయి కలుపు మొక్కలను నిర్మూలించేలా చర్యలు తీసుకుంటే 50 శాతం మొక్కలను నివారించగలుగుతామని ఇదే విధానాన్ని కొనసాగిస్తే పార్థీనియం మొక్కలు కనుమరుగై ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.