యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చక బృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పాంచ రాత్రాగమశాస్త్ర ప్రకారం సుమారు గంటకుపైగా లక్షపుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. సుమారు గంటన్నర పాటు సాగిన వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులు స్వయంభువుడిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 48, 81, 789 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.