ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తించాయి. ఉత్తర ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ, కోస్తా, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదరుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలు, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత నెలకొంది. కర్నూలులో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.