సమస్యల పరిష్కారం కోసం ఎండీయూ వాహన ఆపరేటర్లు శనివారం నుంచి సమ్మె బాట పట్టారు. బీమా సదుపాయం కల్పించాలని, బియ్యం బస్తాల్లో తరుగు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. దీంతో రేషన్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు జిల్లాలో 1,513 చౌక దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా 7,22,257 కుటుంబాలకు సరుకులు అందజేస్తారు. జిల్లాలో మొత్తం 438 ఎండీయూ వాహనాలు ఉండగా.. ఆపరేటర్‌తో పాటు బియ్యం తూకం వేసే సహాయకుడు ఉపాధి పొందుతున్నాడు. ఎండీయూ ఆపరేటర్లకు సంబంధించి బీమా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కాగా సంబంధిత బ్యాంక్ అధికారులు ఒక్కో ఎండీయూ ఆపరేటర్‌కు రూ.18 వేల నుంచి రూ.23వేల వరకు మినహాయించుకుంటున్నారు. దీంతో సమ్మె అనివార్యమైందని ఎండీయూ ఆపరేటర్లు అంటున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సరుకుల పంపిణీ చేసేదే లేదని వారు స్పష్టం చేస్తున్నారు.