భారత పార్లమెంటు వ్యవహారాల గురించి ప్రస్థుత రాజకీయాల గురించి విద్యార్ధి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని తాడేపల్లి కె. ఎల్. విశ్వవిద్యాలయం ఆర్ట్స్ విభాగ అధిపతి డాక్టర్ వెంకటేశ్వర్ కుమార్ అన్నారు. సోమవారం ఆర్ట్స్ కళాశాల విద్యార్దులకు మాక్ పార్లమెంటు నిర్వహించిన సందర్బంగా ఆయన విద్యార్దులతో మాట్లాడుతూ రాజనీతి శాస్త్రంలోని ఆయా విభాగాల గురించి బిఎ ఐఎఎస్ విద్యార్ధులకు వివరించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్లమెంటు వ్యవస్థ మన ధేశానిది అని అన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్. అంబేద్కర్ లాంటి మేధావులు భారత పార్లమెంటులో తమ ప్రసంగాలతో ప్రతిపక్ష నాయకులను సైతం ఆశ్చర్యపరిచేవారని అన్నారు.
భారత లోక్ సభకు గణేష్ వాసుదేవ్ మావలంకర్ మొట్టమొదటి లోక్ సభకు స్పీకర్ గానూ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రథమ ప్రధానిగా వ్యవహరించారని గుర్తు చేశారు. మొదటి తరం లోక్ సభ సభ్యుల నుండి నేటి తరం రాజకీయ నాయకులు నేర్చుకోవలసింది ఎంతో ఉందని అన్నారు.
కెఎల్. యు లో నిర్వహించిన మాక్ పార్లమెంట్ లో బిఎ ఐఎఎస్ చదువుతున్న జి. ఉదయ్ కుమార్ స్పీకర్ గా వ్యవహరించారు. ఉదయం పలు తీర్మానాలను ప్రవేశపెట్టి సాయంత్రం ఆమోదించారు. ప్రధాన మంత్రిగా బిఎ ఐఎఎస్ చదువుతున్న విద్యార్ధిని తెనాలి అపూర్వ, ఆర్ధీకశాఖ ధరనేశ్వరరెడ్డి, హోం శాఖ మంత్రిగా సి. గంగా సాత్విక్, ప్రతి పక్ష పార్టీలయిన కాంగ్రెస్ తరుపున వెంకటనరేంద్ర , తమ్మిన చిన్మయి, ప్రవీణ్, శివసేన నాయకులుగా ఆర్. రామకృష్ణ లు నాయకులుగా పరకాయ ప్రవేశం చేసి లోక్ సభలో అధికార ప్రతిపక్ష నాయకుల పాత్రలను అభినయిస్తూ భారతదేశంలో జరుగుతున్న పలు అవినీతి కార్యక్రమాలపైన అధికార పార్టీని ప్రశ్నిస్తూ సభను హోందాగా నడపడం ఎంతగానో ఆకట్టుకుంది.
అధికార పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్ది అనిల్ తమ విధి విధానలతోపాటు ప్రభుత్వం యొక్క పథకాలను వివరించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల చర్చల అనంతరం రైట్ టూ రీకాల్ – 2023 అంశం మీద చర్చించారు.
ప్రతిపక్ష పార్టీలు బిల్లు పై తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. బిల్లు ప్రజాస్వామ్యం అని పార్లమెంట్ లో నినదించారు. ప్రతిపక్ష ఎంపీలు బిల్లుపై తమ అభిప్రాయం తెలిపారు. అధికార పార్టీ ప్రత్యేక మెజారిటీ తో బిల్లును ఆమోదించారు.
రైట్ టూ రీకాల్ బిల్లును మాక్ పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు చట్టం రూపంలో అమలు జరిగితే భారతదేశంలోని రాజకీయాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని స్పీకర్ గా వ్యవహరించిన జి. ఉదయ్ కుమార్ తెలిపారు. ఎన్నికైన శాసన సభ సభ్యులు లేదా లోక్ సభ సభ్యులు రెండున్నర సంవత్సరాల సాధారణ ఎన్నికల తర్వాత కూడ మేనిఫెస్టోలో అతడు/ఆమె ఇచ్చిన 50% వాగ్దానాలు నెరవేర్చలేకపోతే నిర్దిష్ట నియోజకవర్గ ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజా ప్రతనిదిని రీకాల్ చేసే హక్కును పొందుతారు.
భారతపార్లమెంటును తలపించేలా విద్యార్ధులు నిర్వహించిన మాక్ పార్లమెంటును తిలకించిన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్. జి. పార్ధసారధి వర్మ , ప్రో. వైస్. చాన్సలర్ ఎన్. వెంకటరామ్ , జిరిస్ట్రార్ కె. సుబ్బారావు, ఎం. హెచ్. ఎస్. డీన్ డాక్టర్ ఎం. కిషోర్ బాబు, ఆర్ట్స్ విబాగం అధిపతి డాక్టర్ వెంకటేశ్వరకుమార్, ఉప అధిపతి అనిల్ కుమార్ లు విద్యార్ధులను అభినందించారు.