ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక ఆయన పని అయిపోయినట్లేనని చెప్పారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఆయన కాళ్లబేరానికి వస్తారని, ఎమ్మెల్యేల సమావేశమే దీనికి నిదర్శమన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని టీడీపీ నేతలు, శ్రేణులకు పిలుపిచ్చారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. త్వరలో ఉత్తరాంధ్రలో పర్యటిస్తానని ప్రకటించారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకొని పోవాలని, కొందరు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని.. వారికి, గ్రూపులు కట్టిన వారికి పదవులు రావని స్పష్టంచేశారు. పార్టీ బలోపేతం కోసం బయటివాళ్లు వస్తే చేర్చుకోవలసిన అవసరముందని.. అయితే మొదటి ప్రాధాన్యం పార్టీలో ముందు నుంచి ఉన్న వారికే దక్కుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తామన్నారు. ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని, మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కేవలం ట్రయల్ మాత్రమేనన్నారు. 175 సీట్లకు పోటీ చేస్తారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని.. టీడీపీని ఎవరూ శాసించలేరని, పులివెందులలోనే ఆ పార్టీని ఓడిస్తామని చెప్పారు. ‘నాడు టీడీపీ 23 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటే.. దేవుడు స్ర్కిప్ట్ రాశాడంటూ అవహేళన చేశారు. ఇప్పుడు అదే దేవుడు స్ర్కిప్ట్‌ను తిరగరాసి 23వ తేదీ, 2023వ సంవత్సరం, 23 మంది ఎమ్మెల్యేలతో గుణపాఠం చెప్పాడు’ అని అన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే అక్రమ కేసులు పెట్టడం, శుక్రవారం వచ్చిందంటే జేసీబీలు పంపించి నిర్మాణాలు కూల్చేయడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన నిర్మించుకున్న భవనం కూల్చడానికి ఎంతో సమయం పట్టదన్నారు. భద్రాద్రి తెలంగాణకు వెళ్లిపోయిందని ఒంటిమిట్టను అభివృద్ధి చేస్తే శ్రీరామ కల్యాణం నాడు సీఎం జగన్ అక్కడకు వెళ్లలేదని ఆక్షేపించారు.