అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఎం. గౌతమి నియమితులయ్యారు. రాష్ట్రంలో 57 మంది ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా అనంతపురం కలెక్టర్ గా గౌతమి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి విజయనగరం కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం అనంతపురం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న ఎం. గౌతమి వివిధ ప్రాంతాలలో పలు బాధ్యతలను చేపట్టారు. వివిధ హోదాలలో పనిచేసిన ఆమె. విధి నిర్వహణలో అక్కడ తనదైన ముద్ర వేశారు. 2003లో గ్రూప్ వన్ లో ఉత్తీర్ణులైన గౌతమికి తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లాలో వచ్చింది. అనంతపురం ఆర్టీవో గా 2007- 2012 వరకు విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2012 నుంచి 2015 వరకు నెల్లూరు జిల్లా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టి. టి. డి ) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2015-2019 పనిచేశారు. అనంతరం వైయస్సార్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం తిరుపతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.
వైయస్సార్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధి నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆమె చూపిన చొరవ ద్వారా అక్కడి ప్రజల మన్ననలను పొందారు. గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులను ఆడుకోవడంలోను వారికి పునరావాసం కల్పించడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపు లభించింది. అంతేకాక కరోనా సమయంలో లాక్ డౌన్ సందర్భంలో ఇక్కడ చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపడంలో జాయింట్ కలెక్టర్ గౌతమి కీలక పాత్ర పోషించారు.