ఏపీలో అమరావతి రైతులు వర్సెస్ వైసీపీ సర్కార్ అన్నట్లుగా వార్ ఇంకా నడుస్తోంది. అమరావతి రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజధాని ప్రాంతంలో ఆర్-5 జోన్ ఏర్పాటుపై విడుదల చేసిన గెజిట్‌పై పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేశారు. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీం కోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాల ద్విసభ్య ధర్మాసనం దగ్గర ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని రైతుల తరఫున లాయర్ కోరారు.
ఏపీ హైకోర్టులో ఆర్-5 జోన్ పై కేసు నడుస్తోందని.. అక్కడ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించామని లాయర్ ధర్మాసనానికి వివరించారు. వచ్చే సోమవారం రోజే విచారణ జరపాలని లాయర్ కోరారు. సోమవారం విచారణ చేయాల్సిన కేసుల జాబితా ఇప్పటికే సిద్ధమైందని, 14న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.
ఏపీ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళగిరి మండలంలోని నిడమర్రు,కృష్ణాయపాలెం, కురగల్లు.. అలాగే తుళ్లూరు మండలంలోని ఐనవోలు, మందడం పరిధిలో 900 ఎకరాలను ఆర్-5 జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. 2022 అక్టోబరులోనే ప్రభుత్వం ఆర్-5 జోన్‌పై విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. తమ అభిప్రాయాలను తీసుకోలేదని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశించడంతో రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించగా.. రైతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మళ్లీ ఇప్పుడు గెజిట్ ఇచ్చారు.
అమరావతి రైతులు ఈ గెజిట్‌పై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల్ని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇతర జిల్లాలు, ప్రాంతాల్లో పేదలందరికి ఇళ్లు పథకం పేరుతో.. రాజధాని కోసం సమీకరించిన భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో హైకోర్టు ఈ జీవోను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు.
అలాగే ఈ ఉత్తర్వులు జోనల్ రెగ్యులేషన్‌కు విరుద్ధమని.. పరిధిని కుదించడమేనన్నారు. రాజకీయ అజెండాలో భాగంగా ఇలా రాజధాని ప్రాంతానికి చెందనివారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారన్నారు. అంతేకాదు స్థానిక ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను సీఆర్డీఏ పట్టించుకోలేదన్నారు. ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.
ఆర్-5 జోన్‌పై రైతులు దాఖలు చేసి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. లాయర్ల వాదనలు వినిపించగా.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని.. అక్కడికి వెళ్లొచ్చు కదా అని ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రభుత్వం, సీఆర్డీఏను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ జరుపుతామని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa