వచ్చే దేశ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే విజయమని, ఇదే నిజమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. హనుమంతుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారత అభివృద్ధి ప్రయాణం సాగుతోందని మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ కూడా ఈ స్ఫూర్తి మంత్రాన్నే నమ్ముకుని ప్రజల కోసం పనిచేస్తోందని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమదే గెలుపని, తమను ఎవరూ ఓడించలేరని, ఇది నిజమని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. హనుమాన్ జయంతి వేళ విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ‘రాక్షసులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు హనుమంతుడు కూడా అంతే కఠినంగా మారారు.. అదేవిధంగా అవినీతి, కుటుంబ పాలన, శాంతిభద్రతల విషయంలో బీజేపీ మరింత దృఢంగా వ్యవహరిస్తుంది’ అని అన్నారు.
బీజేపీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి విర్చువల్‌గా మోదీ ప్రసంగించారు. ‘నేడు హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.. అతని జీవితం, ఆయన జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు నేటికీ మనకు స్ఫూర్తినిస్తాయి.. పవన సుతుడు హనుమంతుడు చేయలేని పని లేదు’ అని మోదీ పేర్కొన్నారు.
‘హనుమాన్ జీకి అపారమైన శక్తి ఉంది, కానీ తన స్వీయ సందేహాన్ని తొలగించినప్పుడే ఈ శక్తిని ఉపయోగించగలడు.. 2014కి ముందు భారతదేశం అదే పరిస్థితిలో ఉంది, కానీ నేడు, బజరంగబలిలాగ, భారతదేశం తనలో దాగి ఉన్న శక్తులను గ్రహించింది.. భారీ సవాళ్లను అధిగమించడానికి, ఎదుర్కోవడానికి గతంలో కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని అన్నారు.
బీజేపీకి 50 ఏళ్లు, 2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండు ముఖ్యమైన మైలురాళ్లపై అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికతతో పని చేయాలని ప్రధాని మోదీ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ, పార్టీ కార్యకర్తలు అతి విశ్వాసానికి పోవద్దని అన్నారు. కేవలం ఎన్నికల్లో గెలుపే వరకే పరిమితం కాకూడదని, ప్రజల హృదయాలను కూడా గెలుచుకోవాలని ప్రధాని హితబోధ చేశారు.
బీజేపీని భవిష్యత్తు 21వ శతాబ్దపు పార్టీగా మార్చాలని ప్రధాని అన్నారు. కేంద్రం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. ‘బీజేపీ ప్రజాస్వామ్య గర్భం నుంచి పుట్టిందని, ప్రజాస్వామ్యం అనే అమృతాన్ని పుష్కలంగా అందిస్తోంది’ అని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీ అహోరాత్రులు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వచ్చే సాధారణ ఎన్నికలకు ప్రధాని సమర శంఖం పూరించారు.‘1980వ దశకం నుంచి మనం ప్రతి ఎన్నికల్లోనూ అంకితభావం, ఒకేవిధమైన శక్తి, దేశం మొదటి అనే స్ఫూర్తి మంత్రంతో పోరాడతున్నాం.. ఇవే మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని మోదీ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa