ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటి ప్రమాదంలో గాయపడ్డ భారత విద్యార్థికి పరిహారం చెల్లించాలని యూఏఈ సుప్రీంకోర్టు ఆదేశం

international |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2023, 09:01 PM

గత  2019లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ భారతీయ విద్యార్థికి నష్టపరిహారం చెల్లించాలని తాజాగా యూఏఈ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలావుంటే 2019లో దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది భారతీయుల సహా 17 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన భారతీయ విద్యార్ధికి 5 మిలియన్ల దిర్హామ్స్ (రూ.11 కోట్లు) పరిహారం అందజేయనున్నట్టు మీడియా నివేదిక తెలిపింది. ఇంజినీరింగ్ విద్యార్థి మొహమూద్ బైగ్ మీర్జా ఒమన్ నుంచి యూఏఈకి బస్సులో వెళ్తుండగా దుబాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ఎంట్రీ పాయింట్ వద్ద ఓవర్‌హెడ్ హైట్ బారియర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సు ఎడమ ఎగువ భాగం ధ్వంసమై 17 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ కేసులో ఒమన్‌కు చెందిన డ్రైవర్‌కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించిన స్థానిక కోర్టు.. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని ఆదేశించింది.


మీర్జా లాయర్ల ప్రకారం.. యూఏఈ ఇన్సూరెన్స్ అథారిటీ ప్రాథమిక రాజీ కోర్టు అతనికి మొదట ఒక మిలియన్ దిర్హామ్‌లు పరిహారంగా ఇచ్చింది. పిటిషనర్లు దుబాయ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టును ఆశ్రయించడంతో పరిహారం 5 మిలియన్ దిర్హామ్‌లకు సవరించిందని నివేదిక పేర్కొంది. మీర్జా తన బంధువులతో సెలవులు గడిపి మస్కట్ నుంచి వెళ్తుండగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.


తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన మీర్జా.. 14 రోజుల పాటు అపస్మార స్థితిలోనే ఉన్నాడు. రెండు నెలల పాటు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత కూడా పునరావాస కేంద్రంలో చికిత్స పొందారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చదువుతోన్న అతడు చివరి సెమిస్టర్ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో తన చదువును పూర్తి చేయలేకపోయాడు. ప్రమాదంలో మీర్జా మెదడుకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దీంతో ఆయన సాధారణ జీవితానికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.


తల, చెవులు, నోరు, ఊపిరితిత్తులు, చేతులు,కాళ్లకు కూడా గాయాలైనట్టు ఫోరెన్సిక్ వైద్య నిపుణులు అంచనా వేశారు. మీర్జా మెదడుకు 50 శాతం శాశ్వతంగా నష్టం వాటిల్లిందని తెలిపిన నివేదిక ఆధారంగా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా యూఏఈ సుప్రీంకోర్టు బీమా కంపెనీని ఆదేశించిందని నివేదిక తెలిపింది.


మెదడుకు తీవ్ర నష్టం జరగడంతో షార్ట్ టెర్మ్ మెమొరీ లాస్‌తో బాధపడుతున్నాడు. ‘మొహమ్మద్ తేలికగా మరచిపోతాడు కాబట్టి తిన్న గంట తర్వాత ఆహారం లేదా ఔషధం కోసం అడుగుతాడు.. అతను నిలకడగా నడవలేడు.. కాలు లాగేసింది.. తరచుగా చిరాకుపడి క్షమాపణలు చెబుతాడు’ అని అతడి తరఫు లాయర్ చెప్పారు. మీర్జా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే ఈ పరిహారం తమ కుమారుడి సంరక్షణ కోసం సహాయపడుతుందని వారు భావిస్తున్నట్టు పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa