ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల పొత్తుల గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కెక్కడదని, ఒకే భావజాలం కలిగిన రాజకీయ పార్టీలు పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకుంటాయని, అది తప్పు కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. శుక్రవారం మండల కేంద్రం భట్టిప్రోలు లో విలేఖర్లతో మాట్లాడుచూ ప్రతిపక్షాలను సింగిల్ గా 175 నియోజకవర్గాలలో విడి విడిగా పోటీ చేయాలని అంటున్న జగన్ రెడ్డి కేంద్రంలో 543 నియోజకవర్గాలలో బీ. జే. పీ. ఒంటరిగా పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీని ప్రశ్నించ గలడా అని ప్రశ్నించారు. రాజకీయాలలో ఎన్నికల వ్యూహాలు, పొత్తులు అనేది సహజమని, దానిని ప్రశ్నించే హక్కు మరొక రాజకీయ పార్టీకి ఉండదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వం పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని, తద్వారా జగన్ రెడ్డి లబ్ది పొందాలని ఈ విధమైన మాటలతో ప్రతిపక్షాలను రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారని సాయిబాబా అన్నారు. ఎన్ని కుయుక్తులు, కుట్రలు, దౌర్జన్యాలు చేసినా ఒక్క చాన్స్ అని అడిగిన జగనరెడ్డికి ఇదే ఆఖరి అవకాశమని అన్నారు. అనుభవ రాహిత్యంతో రాష్ట్రాన్ని అదోగతి పాల్జేసి, రాజధాని లేని రాష్ట్రంగా, అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ గా, అన్ని రంగాలలో వైఫల్యం చెందిన జగన్ మోహనరెడ్డికి ఈ ఎన్నికలే చివరి ఎన్నికలుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కుక్కల వెంకటేశ్వరరావు, గొట్టిముక్కల లెనిన్, ఇర్ఫాన్ బేగ్, చల్లా నాగరాజు, డొక్కు శ్రీనివాసరావు, సయ్యద్ అబ్దుల్ కలాం, కంభం సుధీర్, హాసన్ బేగ్, షేక్ ఇంతియాజ్, ఆదిన బసవపున్నయ్య తదితరులు పాల్గొన్నారు.