ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యం వివాదాల్లో.... బౌద్ద గురువు దలైలామా

international |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 09:16 PM

బాలుడ్ని లిప్ కిస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు వెల్లువెత్తడంతో ప్రముఖ ఆధ్యాత్మిక గురు, బౌద్ధ గురువు దలైలామా క్షమాపణలు చెప్పారు. ‘ఇటీవల జరిగిన సమావేశంలో ఒక బాలుడ్ని దలైలామాను ఆలింగనం చేసుకుంటారా? అని అడుగుతోన్న వీడియో వైరల్ అయ్యింది.. ఈ మాటలు బాధించినందుకు బాలుడు, అతడి కుటుంబం, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది స్నేహితులకు క్షమాపణలు చెప్పాలని కోరుకున్నారు.. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు’ అని దలైలామా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


ఫిబ్రవరి 28న ధర్మశాల శివారులోని మెక్‌లియోడ్ గంజ్‌ వద్ద జరిగిన ఆధ్మాత్మిక కార్యక్రమంలో దలైలామా పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన ఈ వేడుకకు 100 మంది వరకూ స్కూల్ విద్యార్థులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మిమ్మల్ని ఆలింగనం చేసుకోవచ్చా అని ఓ చిన్నారి అడిగితే.. వేదికపైకి రావాలని దలైలామా కోరారు. తనకు నమస్కరించడానికి ప్రయత్నిస్తోన్న బాలుడ్ని ముందు కూర్చుబెట్టుకుని అతడి పెదవులపై ముద్దు పెట్టారు. ఆ తర్వాత తన నాలుకను బయటికి తీసి, నోటితో చప్పరించమని పిల్లాడ్ని అడిగారు. దలైలామా నవ్వుతూ మరోసారి హత్తుకునేందుకు ప్రయత్నించగా బాలుడు దూరంగా వెళ్లిపోయాడని ఓ అంతర్జాతీయ పత్రిక తెలిపింది.


అయితే, ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రకారం.. నాలుకను బయటకు తీయడాన్ని అసహ్యకరంగా పరిగణిస్తాం కానీ, టిబెట్‌ సంప్రదాయంలో ఇది ఓ భాగం. తొమ్మిదో శతాబ్దం నుంచి టిబెటన్ ప్రజలు అనుసరించే సంప్రదాయని తెలిపింది. 9వ శతాబ్దంలో టిబెట్‌ను పాలించిన లాంగ్‌ దామా రాజు ఎంతో క్రూరమైన వ్యక్తి. అయితే అతడి నాలుక నల్లగా ఉండేదట. దీంతో టిబెట్ ప్రజలు తమ నాలుకను బయటపెట్టి, తమను కలిసిన వ్యక్తులకు ఆ రాజుతో తమకు సంబంధం లేదని చెప్పేందుకు ఇలా నాలుకను బయటకు తీసి మరీ స్వాగతం పలుకుతారు. అప్పటినుంచి ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. కాలక్రమేణా ఇది పలకరింపునకు సంకేతంగా మారిపోయింది.


యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్‌ పరిశోధనను కూడా ఆ పత్రిక కథనం ప్రస్తావించింది. ఒకరి నాలుకను బయటకు తీయడం గౌరవం లేదా ఒప్పందానికి సంకేతం. సాంప్రదాయ టిబెటన్ సంస్కృతిలో అతిథులను స్వాగతించడానికి దీనిని ఉపయోగిస్తుంటారని పేర్కొంది.


అయితే, దలైలామాకు వివాదాలు కొత్తేం కాదు. 2019లో తన వారసురాలు మహిళైతే చాలా ఆకర్షణీయంగా ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. అదే ఏడాది స్వీడన్‌లోని మాల్మోలో వలసల అంశంపై మాట్లాడుతూ.. ఐరోపా యూరోపియన్లకు చెందిందని, శరణార్థులు తమ దేశాలకు వెళ్లాలని దలైలామా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, మహ్మద్ అలీ జిన్నా భారత్ ప్రధాని కావాలని మహాత్మా గాంధీ కోరుకుంటే జవహర్ లాల్ నెహ్రూ అందుకు అంగీకరించలేదని 2018లో దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గాంధీ కల నిజమైతే భారత్, పాక్‌లు మళ్లీ కలిసేవని వ్యాఖ్యానించారు. దీనిపై వివాదం చెలరేగడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. 1959 నుంచి భారత్‌లో ప్రవాసం ఉంటోన్న టిబెటన్ గురువును చైనా మాత్రం వేర్పాటువాదిగా ముద్రవేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa