ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని తానెప్పుడూ చూడలేదని మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దాడులు చేసిన సంస్కృతి లేదన్నారు. తాను ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదని.. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకేలా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి.. విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
60 సంవత్సరాలకు పైగా తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగామని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. అయితే, వివిధ పరిణామాలు వల్ల రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. అయితే, రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చూశానని.. కానీ, అక్కడ నిర్ణయాలతో ఒక్కో రాష్ట్రంలో పార్టీ దెబ్బ తినే పరిస్థితి ఉందన్నారు. అధిష్ఠానం అస్తవ్యస్థ నిర్ణయాలతో కాంగ్రెస్ బాగా దెబ్బతిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి, తనకు మధ్య జరిగిన కొన్ని చర్చలకు సంబంధించిన అంశాలను కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తనకు పీసీసీ అధ్యక్షుడు పదవి ఇస్తామన్నా.. వద్దని చెప్పినట్లు తెలిపారు. బాటిల్ నుంచి నీళ్లు పడకముందే జాగ్రత్త ఉండాలని.. కానీ, కింద పడ్డాక మళ్లీ ఆ నీళ్లను సీసాలో పోయలేం అనే విషయాన్ని వాళ్లకి చెప్పానని గుర్తు చేసుకున్నారు. అయినా అందరం కలిసి పని చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెంచామని తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న సమయంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ)తో పొత్తుకు వెళ్లారని మండిపడ్డారు. ఎవరినీ అడగకుండా, చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లే తాను బయటకి వచ్చేశానని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన నచ్చి.. ప్రజలకు మంచి చేయవచ్చనే నమ్మకంతో బీజేపీలో చేరానని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను మా నాన్న నల్లారి అమర్నాథ్ రెడ్డి కాలం నుంచి రాజకీయాల్లో ఉంటున్నానని.. ఇందిరా గాంధీ సమయం నుంచి కాంగ్రెస్ బలోపేతం అయిన పరిస్థితి కూడా వాళ్లకి చెప్పానని గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్ బలోపేతంపై వారు దృష్టి పెట్టలేదని విమర్శించారు.
ఇదే సమయంలో బీజేపీ గ్రామ స్థాయి నుంచి బలం పెంచుకునే కార్యక్రమం చేపట్టిందని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. 1984లో దేశంలో బీజేపీకి రెండు సీట్లు ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి 404 సీట్లు ఉండేవని.. 2014లో ఏడు శాతం నుంచి 31 శాతానికి బీజేపీకి ప్రజా మద్దతు పెరిగిందన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి 19.3 శాతం ఓట్లు, 44 సీట్లు మాత్రమే వచ్చాయని వివరించారు.
2019లో బీజేపీకి 303 ఎంపీ సీట్లు వస్తే, కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లకే పరిమితమైందని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని.. కానీ, పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రజల మధ్య తాను ఉండాలా? లేదా? అని ఆలోచించానని.. కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు చేరువ కాలేనని అర్థం అయ్యిందన్నారు. అదే బీజేపీలో ఉంటే ప్రజలకు దగ్గర కావచ్చనే ఆ పార్టీలో చేరానని వెల్లడించారు. బీజేపీకి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. వారు తనను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలన్నారు. బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటే తనది కూడా అదే స్టాండ్ అని స్పష్టం చేశారు. అమరావతి విషయంలో బీజేపీ నిర్ణయాలే తన నిర్ణయం అని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు.