తాము తీసుకొచ్చిన రంజాన్‌తోఫా, దుల్హన్, వంటి సంక్షేమ పథకాలను వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని తీసేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఇదిలావుంటే నారా లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పెద్దపప్పూరులో దూదేకుల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. టీడీపీ హయాంలో రంజాన్‌తోఫా, దుల్హన్, వంటి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నీ రద్దు చేశారన్నారు. అలాగే పెన్నానదిలో ఇసుక రీచ్‌ను పరిశీలించిన లోకేష్.. దీనిపై ప్రశ్నించిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పై కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. తన పాదయాత్ర ఉందని రెండు రోజుల నుంచి తవ్వకాలు నిలిపివేశారన్నారు లోకేష్.
మరోవైపు పెద్దపప్పూరులో జేసీ బ్రదర్స్, టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. అమరావతి, విశాఖ, కర్నూలు, పులివెందులలో ఏపీ రాజధాని ఏదో సరిగా చెప్పాలన్నారు.. చెప్పిన వారికి రూ.లక్ష బహుమతి లోకేష్ చేతుల మీదుగా అందజేస్తామని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. అలాగే ఇసుక అక్రమ తవ్వకాలపై మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రాష్ట్రం కోసం పదువులు త్యాగం చేశారంటూ.. ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటుగా.. ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం.
ఇదిలా ఉంటే లోకేష్ మరో ఫ్లెక్సీ చూసి నవ్వుకున్నారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నారా దేవాన్ష్, జేసీ బ్రదర్స్ మనవడు ధీర్ రెడ్డితో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ' మా నాన్నలు నలభైలో ఉన్నారు.. వాళ్ల స్థితే అధ్వాన్నంగా ఉంటే.. 10లో ఉన్నాం మా పరిస్థితేంటో?' అంటూ ఇద్దరి ఫోటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రేపటి బాగు కోసం కదలిరండి అని పిలుపునిచ్చారు. ఈ ఫ్లెక్సీని చూసిన లోకేష్ కొద్దిసేపు నవ్వుకున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు డీఎస్పీ వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. లోకేష్ తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో యాడికి మండలం టీడీపీ నేతకు నోటీసు ఇచ్చారు. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే లోకేష్ పాదయాత్ర దగ్గరకు వెళ్లి తేల్చుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో లోకేష్ పాదయాత్ర సందర్భంగా అదనంగా భద్రత కల్పించారు. అటు వైఎస్సార్‌సీపీ నేతలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోరారు.