టెక్కలి నియోజకవర్గం, సంతబొమ్మాళి పరిధిలోని భావనపాడు పోర్టు ఇకపై మూలపేట పోర్టుగా పిలవబడనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది టెక్కలిలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మూలపేట పంచాయతీ పెద్దలు, రైతులతో కలెక్టర్ శ్రీకేష్‌బాలాజీలఠ్కర్, అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలు వారి ముందు 75 డిమాండ్‌లు ఉంచారు. అందులో మొదటగా.. భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పేరును.. నిర్వాసిత గ్రామమైన మూలపేట పోర్టుగా నామకరణం చేయాలని కోరారు. తాము పోర్టు కోసం గ్రామాన్ని, భూములను త్యాగం చేశామని.. పోర్టు పేరు తమ గ్రామం పేరుతో ఉండాలని మూలపేట వాసులు కలెక్టర్ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌కు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చుతూ.. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీప్ సెక్రటరీ ఆర్.కరికల్ వలెవన్ ఆదివారం ఉత్తర్వులు(మెమోనెంబర్. ఐఎన్101 పోర్ట్స్44/2020 డేటెడ్ 16-04-2023) జారీ చేశారు.