గంజాయి, మత్తు పదార్థాల సరఫరాకు కేంద్రాలుగా అదానీ పోర్టులు మారిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ధ్వజమెత్తారు. సంపద మొత్తం కోటీశ్వరుల చేతికి వెళ్లిపోతోందన్నారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి నగరంలో ప్రచారభేరిలో భాగంగా సీపీఐ, సీపీఎం అధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు ఉండగా బీజేపీ ఆందోళన చేసిందని నేడు మోదీ హయాంలో గ్యాస్ సిలిండర్ ధరరూ. 1, 200 రూపాయలకు చేరిందని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నల్లధనం బయట తీస్తానంటూ, పెద్ద నోట్లు రద్దు చేసి నల్ల ధనం మొత్తం తమకు కావాల్సిన వారి ఇళ్లకు చేర్చారని విమర్శించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి -దక్కాల్సిన హక్కులను ప్రశ్నించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని, రాష్ట్రం నుంచి కేంద్రానికి చెల్లించిన జీఎస్టీ డబ్బులు రాబట్టుకోవడానికి కూడా సాహసం చేయడం లేదని చెప్పారు. ప్రజలకు జానెడు ఇచ్చి బారెడు లాక్కోవడం జగన్ విధానమని నారాయణ అన్నారు. మద్యం, ఇసుక, చివరకు సినిమా టికెట్ల నుంచి కూడా ప్రజల నుంచి దండుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. రాష్ట్రంలో దళితులపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందన్నారు. చివరకు ముఖ్యమంత్రి చిన్నాన్న కూడా దారుణ హత్యకు గురయ్యారని, ఎవరు హత్య చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసు అని, ఇలాంటి కేసుల నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి దాసోహం జగన్ అయిపోయాడని విమర్శించారు. వేలిముద్ర గాళ్లకు ఓట్లు వేయించుకున్న ఘనత జగన్కో దక్కుతుందన్నారు. వైసీపీ, బీజేపీ ప్రభుత్వాలను సాగనంపేందుకు విపక్షాలతో పాటు ప్రజలూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని కోరారు.