‘‘నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఈ నెలాఖరులోగా బిల్లులు విడుదల చేయాలి. లేకుంటే మే 1వ తేదీ నుంచి ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు చేయలేం’’ అని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ హెచ్చరించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఎంఎన్ హరీంద్రప్రసాద్‌కు ఈ మేరకు లేఖ రాసింది. నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నాయని, చివరికి డాక్టర్లకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతకాలంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నెట్‌వర్క్ ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించడం లేదు. కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అసోసియేషన్.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు ఘాటు లేఖ రాసింది. 2022 జూలై తర్వాత ఉద్యోగుల హెల్త్‌స్కీమ్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని పేర్కొంది. ఆగస్టు 2022 తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయలేదని తెలిపింది. కాగా అసోసియేషన్ లేఖ రాసిన విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కొట్టిపారేసింది. తమకు ఎవరూ ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని, ఈ ప్రచారంలో నిజం లేదని పేర్కొంది.