మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాత్ర కూడా ఉందని టీడీపీ ఆరోపించింది. ఈ సందర్బముగా కొందరు టీడీపీ నాయకులూ మాట్లాడుతూ.... ‘‘వివేకా బతికుంటే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అవినాశ్‌రెడ్డి అనుకొంటే... వివేకా వల్ల తన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిలకు ఆస్తిలో సమాన భాగం ఇవ్వాల్సి వస్తుందని జగన్ భావించారు. ఆ క్రమంలో ఇద్దరూ కలిసే క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిపోయేలా హత్యకు పథక రచన చేసి అమలు చేశారు. తర్వాత ఏమీ తెలియనట్లు ఆస్కార్ నటులను మించిన నటన ప్రదర్శిస్తున్నారు. ఎన్నో హత్య కేసులను దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు కూడా జగన్ తీరుతో నివ్వెరపోతున్నారు’’ అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ హత్య కేసులో జగన్ అనేకసార్లు యూ టర్న్ తీసుకోవడానికి ఆయన పాత్ర కూడా ఉండటమే కారణమని ఆరోపించారు. ‘ఈ హత్య కేసును సీబీఐతో విచారణ జరపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి కాగానే సీబీఐ విచారణ అవసరం లేదని ఆ పిటిషన్‌ను వెనక్కు తీసుకొన్నారు. ఎందుకు వెనక్కు తీసుకున్నారో ఇప్పటివరకూ సమాధానం లేదు. తన సొంత పేపర్లో ఈ హత్యపై రోజుకో కారణంతో కథనాలు వండి వారుస్తున్నారు. ఆయన సొంత పత్రికలో ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా ఇటువంటి కథనాలు రావు. వివేకా హత్య తర్వాత ఆయన శవంపై గాయాలు కనిపించకుండా కట్లు కట్టించింది ఎవరు? కుమార్తె సునీత వచ్చేవరకూ ఆగకుండా వివేకా మృత దేహానికి తూతూమంత్రంగా పోస్టుమార్టం చేయించింది ఎవరు? వివేకాకు రోజుకో అక్రమ సంబంధం అంటగట్టి దాని వల్లే ఆయన హత్య జరిగిందని అడ్డగోలుగా రాయిస్తున్నారు. అసలు హంతకులను కాపాడటానికి జగన్ తన సొంత, కూలి మీడియాను వాడుకొంటున్నారు. హత్య జరిగిన రోజు రాత్రి అవినాశ్‌రెడ్డి ఫోన్లో జగన్‌తో, ఆయన సతీమణి భారతితో మాట్లాడారని ఇప్పటికే రుజువైంది. సీబీఐ సేకరించిన కాల్ లిస్ట్‌లో ఈ విషయం బయటపడింది. దానికి సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు’’ అని ఉమా విమర్శించారు. సీబీఐకి ఇప్పటివరకూ దొరికింది చిన్న చేపలేనని... అసలైన కిల్లర్ ఫిష్‌లు ఇంకా దొరకలేదని వ్యాఖ్యానించారు.