ఈ ఏడాది నుంచి ఐదు మెడికల్ కాలేజీల్లో కొత్తగా తరగతులు ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఈ కాలేజీల్లో అన్నిరకాల వసతులు సమకూర్చామని తెలిపారు. శుక్రవారం మంత్రి ఏపీఎ్‌సఎంఐడీసీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలకు అనుమతులు వస్తాయన్న ఆశాభావం మంత్రి వ్యక్తం చేశారు. ‘‘తరగతులు ప్రారంభమయ్యాక మరోసారి ఈ కాలేజీల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు ఉంటాయి. సిద్ధంగా ఉండాలి’’ అని సూచించారు. వచ్చే ఏడాది ఆదోని, పులివెందుల, పాడేరు పరిధిలో మరో మూడు ప్రభుత్వ కళాశాలలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని జూన్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఆస్పత్రి, కడపలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఆరోగ్యశాఖ... కళాశాలల్లో మెరుగుపరిచిన వసతులు, చేపట్టిన నియామకాల ఫలితంగా ఏకంగా 65 శాతం సీట్లను నాలుగేళ్ల కాలంలోనే పెంచామన్నారు. గతంలో మన రాష్ట్రంలో 966 పీజీ సీట్లు అందుబాటులో ఉంటే ఈ ఏడాది 1593కు అవి చేరాయన్నారు. ఎన్‌ఎంసీ తుది దశ తనిఖీలన్నీ పూర్తయ్యేలోగా మరో 50 నుంచి 100 సీట్లు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.