మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మంగళగిరి దళిత నాయకులు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం దళితజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బాబు నీతిమాలిన చర్యలకు పాల్పడటాన్ని రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పొలుమట్ల ప్రేమ్ కుమార్, గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఎర్రగుండ్ల భాగ్యరావు, నియోజకవర్గ ఎస్సీ ఉపాధ్యక్షులు మండేపూడి వీరయ్య, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఈపూరి పెద్దబ్బాయిలు తీవ్రంగా ఖండించారు. శనివారం మంగళగిరి పట్టణంలోని ఎంఎస్ఎస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోలేక అడ్డదారుల్లో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయడం ఒక వైసీపీ పార్టీకే చెల్లిందన్నారు. శాంతిభద్రతలు కాపాడవలసిన ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిపై దాడులకు ప్రోత్సహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన ఆదిమూలపు సురేష్ ను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పాదయాత్రకు భద్రత కల్పించినట్లు గుర్తు చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినప్పుడు, విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించినప్పుడు కనిపించని ఆదిమూలపు సురేష్ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చంద్రబాబుపై దాడికి ఉసిగొల్పడం సరికాదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 27 దళిత పథకాలను రద్దు చేశారని అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించినట్లు తెలిపారు. చీటికి మాటకి ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు యర్రగొండపాలెంలో వైసీపీ రౌడీలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
ఆదిమూలపు సురేష్, ఆయన సతీమణి విజయలక్ష్మిలు ఐ. ఆర్. ఎస్ అధికారులుగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని 2016లో సిబిఐ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా సురేష్ లు ఉన్నారన్నారు. ఆదాయానికి మించి 30కోట్లకు పైగా ఆస్తులు కల్గి ఉన్నారని సిబిఐ చార్జిషిట్ వేసినట్లు తెలిపారు. జగన్ రెడ్ది ప్రభుత్వం దళిత ధన, మాన, ప్రాణాలను కాజేస్తున్న ఏ రోజు స్పందించని ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెంలో బట్టలిప్పి చంద్రబాబుపైన, ఎన్. ఎస్. జి కమాండోలపైన, దళిత ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పైన దాడి చేయించడమంటే తాడేపల్లి ప్యాలెస్ కుట్రలో భాగమే అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కొపూరి రాంబాబు, వనమా సురేష్ తదితరులు పాల్గొన్నారు.