ప్రతి దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ మరియు తి. తి. దే చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి అన్నారు. ఈమేరకు జీవీఎంసీ 49వ వార్డు కప్పరాడ ఎన్టీజీవోస్ కాలనీలో వద్ద నున్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మ అలివేలుమంగ అన్నసమారాధన భవనాన్ని చిన్న జీయర్ స్వామి శనివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ తి. తి. దే చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆలయ ప్రాంగణంలో ప్రతి శనివారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారని అయితే సరైన సౌకర్యాలు లేక ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దాతల సాయంతో సుమారు రూ. 2. 50 కోట్లతో అన్నసమారాధన భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు.
భవనానికి అలివేలుమంగ అన్నసమారాధన భవంతిగా నామకరణం చేయడం జరిగిందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో కుకింగ్, స్టోర్ రూమ్ ఉంటుందని మొదటి అంతస్తులోఒకేసారి 160 మంది భోజనాలు చేసే విధంగా నిర్మాణం చేపట్టారని రెండో అంతస్తును ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంలో సామూహిక భోజన శాలగా ఉపయోగిస్తారన్నారు. మూడో అంతస్తులో పీఠాధిపతులు, అర్చకులు ఉండేందుకు, ముఖ్యమైన ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో మేయర్ గొల్లగాని హరి వెంకటరమణ కుమారి , విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు, పంచకర్ల రమేష్ బాబు విశాఖపట్నం జిల్లా పార్టీఅధ్యక్షులు, శాసన మండలి సభ్యులు వరుదు కల్యాణి హాజరయ్యారు.