ఆస్తుల కోసం, సొంతవాళ్లని కూడా చంపేసే స్థితికి దిగజారిన మనుషులని సమాజంలో చూడాల్సివస్తోంది. సరిగ్గా అలంటి ఘటనే విజయనగరం జిల్లా, కొత్త వలసలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... కొత్తవలస కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న మాదాబత్తుల సూర్యకాంతం ఈ నెల 15న మధ్యాహ్నం ఎప్పటిలా ఇంట్లో పని చేసుకుంటోంది. ఈమెకు వరుసకు కుమారుడయ్యే లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మాదాబత్తుని కృష్ణ ముసుగు ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎవరూ లేక పోవడంతో సూర్యకాంతం మెడలో నున్న రెండు తులాల బంగారు గొలుసును తెంపేందుకు ప్రయత్నం చేశాడు. సూర్యకాంతం ప్రతిఘటించి ముఖానికి ఉన్న రుమాలును తొలగించి కృష్ణగా గుర్తించింది. ఎందుకు తనపై దాడి చేస్తున్నావని ప్రశ్నించింది. అంతలో నిందితుడు వంటగదిలోని కత్తిపీటతో ఆమె తలపై పలుమార్లు గాయపర్చడంతో ఉన్నచోటే ఆమె కూలిపోయింది. అనంతరం ఆమె మెడలోని గొలుసు, చెవికి ఉన్న ఎత్తుగొలుసు(34.495 గ్రాములు)ను పట్టుకుని పరారయ్యాడు. ఘటనా స్థలంలో ఆనవాళ్లు లేకుండా కారం చల్లాడు. దొంగిలించిన బంగారాన్ని విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఉన్న ఓ గోల్డ్ వ్యాపార సంస్థలో తాకట్టు పెట్టి లక్షా 48 వేల రూపాయలు తీసుకున్నాడు. పిల్లలకు స్కూల్‌ఫీజులు చెల్లించి.. దుస్తులు, ఇంట్లోకి కొన్ని వస్తువులు కొనుగోలు చేసి అనంతరం పిల్లలతో అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ నుంచి తానొక్కడే విజయవాడ వెళ్లి కనక దుర్గమ్మకు తలనీలాలు ఇచ్చి కూలిపనుల కోసం కర్ణాటక రాష్ట్రం కొప్పల్‌కు వెళ్లిపోయాడు. పోలీసులకు అనుమానం కలిగి అతన్ని రప్పించేందుకు పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని భార్యతో ఫోన్ చేయించారు. జమ్మాదేవిపేటకు చేరిన వెంటనే నిఘా ఉంచిన పోలీసులు నిందితుడిని పట్టుకుని ఆరా తీశారు. సాంకేతిక పరిజ్ఞానంతో తాము గుర్తించిన ఆధారాలపై విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. కేసును చేధించిన కొత్తవలస సీఐ బుచ్చిరాజు, ఎస్‌ఐలు హేమంత్‌కుమార్, వీర జనార్దన్, సాగరబాబు, సీసీ పోలీసులను ఎస్పీ దీపికాపాటిల్ అభినందించారు.