గుండెలో మైట్రల్ వాల్వ్ లీక్ సమస్యతో బాధపడుతున్న రోగికి కోత, కుట్టులేకుండా అత్యాధునికమైన, అరుదైన మైట్రా క్లిప్ వైద్యచికిత్స నిర్వహించినట్టు గుంటూరు రమేష్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ తరహా వైద్య చికిత్సలు రెండేళ్ల కిందట అమెరికా, యూరోపియన్ దేశాల్లో అందుబాటులోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారని హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీవీఎస్ హరిత తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను తెలిపారు. ఆయాసం, నిస్సత్తువ, మంచానికే పరిమితమైన స్థితిలో ఇటీవల 78 ఏళ్ల హృద్రోగిని చికిత్స కోసం రమేష్ హాస్పిటల్స్‌లో చేర్చారు. గతంలో ఈ రోగికి కేన్సర్, స్టెంట్ చికిత్సలు జరిగాయన్నారు. వైద్యపరీక్షల్లో గుండె కవాటమైన మైట్రల్ వాల్వ్ లీక్ అవుతున్నట్లు నిర్ధారణ అయింది. రోగి వ.యస్సు, పలు అనారోగ్య సమస్యల దృష్ట్యా కవాట మార్పిడి శస్త్రచికిత్స చేయడం కష్టమని, ఇన్‌వేజివ్ పద్ధతిలో నిర్వహించే మైట్రా క్లిప్ చికిత్స అనుకూలంగా ఉంటుందని వైద్యులు భావించారు. కుటుంబ సభ్యులు ఆమోదం తెలపడంతో.. గత ఆదివారం రోగికి రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం మైట్రా క్లిప్ పద్ధతిలో విజయవంతంగా చికిత్స అందించారు. రోగికి వాల్వ్ లీకేజీ బాగా తగ్గడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. ఈ చికిత్సలో కార్డియాక్ ఎనస్థటిస్ట్ డాక్టర్ బికాస్ సాహు, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ జయరామ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అతి కొద్ది సెంటర్లలోనే ఈ చికిత్స అందుబాట్లో ఉందని డాక్టర్ హరిత తెలిపారు. అధునాతన పద్ధతిలో గుండెకవాట చికిత్స నిర్వహించిన వైద్య బృందాన్ని రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమే్‌షబాబు అభినందించారు.