నెల్లూరు జిల్లా దర్గామిట్టలో దేవదాయశాఖ ఆధీనంలో ఉన్న శ్రీకస్తూరిదేవి విద్యాలయానికి చెందిన భూమిలో ఆక్రమణలు తొలగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది ఈ వ్యవహారం పై పూర్తి వివరాలు సమర్పించాలని దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, నెల్లూరుజిల్లా దేవదాయ సహాయ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి, శ్రీ కస్తూరిదేవి విద్యాలయం ఎగ్జిక్యూటివ్ అధికారి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. నెల్లూరు దర్గామిట్ట పరిధిలో సర్వే నంబరు .516/2ఏలో దేవదాయశాఖ ఆధీనంలో ఉన్న శ్రీ కస్తూరిదేవి విద్యాలయానికి చెందిన 17.10 ఎకరాల భూమిలో ఆక్రమణలు తొలగించి, భూమిని రక్షించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ నెల్లూరు జిల్లా, వేదాయపాలెంకి చెందిన పొన్నలూరు పురంధర్‌రెడ్డి మరో ఇద్దరు హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపించారు. ‘ఆడపిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంలో స్వాతంత్య్ర సమరయోధులు రాఘవచారి, పొనకా కనకమ్మ కస్తూరిదేవి విద్యాలయం ఏర్పాటుచేశారు. అడపిల్లలు విద్యను అభ్యసించేందుకు పాఠశాల, కళాశాల ఏర్పాటు చేశారు. ఛారిటబుల్ ట్రస్ట్‌గా ఉన్న ఈ సంస్థను తదనంతరం దేవదాయశాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. పాఠశాలకు సంబంధించిన భూమిని ఆక్రమించి కళ్యాణమండపం నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు’. అని వాదించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలను న్యాయస్థానం ముందు ఉంచాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.