వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే సీబీఐకి ఎటువంటి ఆంక్షలు లేవని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉండగా, అరెస్టు చేయకూడదని ఎక్కడా లేదన్నారు. అరెస్టు చేసుకోవచ్చని న్యాయస్థానం ఇప్పటికే తన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తుచేశారు. హైకోర్టులో అవినాశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసినప్పటికీ, తీర్పు మాత్రం జూన్ మొదటి వారంలో వెలువడే అవకాశాలు ఉన్నాయన్నారు. హత్యకేసులో పూర్తి ఆధారాలున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. వివేకా హత్యకేసు తేలడానికి రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉందని, ఈలోగా ఎన్నికలు వస్తే... అవినాశ్‌ను, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అన్యాయంగా ఈ కేసులోకి లాగారని ప్రజలను మభ్యపెట్టే విధంగా ఆయన పత్రిక రాతలున్నాయని మండిపడ్డారు. అందులో అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసిన వార్తను, షర్మిల చేసిన వ్యాఖ్యలను రాయరని, కానీ అవినాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వినిపించిన వాదనల గురించి మాత్రం రాస్తారని రఘురామ ఎద్దేవా చేశారు. వివేకా రాసిన లేఖపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను, తాజాగా అవినాశ్ విడుదల చేసిన వీడియోను ఆయన మీడియా ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. వీరిద్దరిలో ఉత్తమ నటులు ఎవరో, ఆస్కార్ అవార్డు ఎవరికి లభిస్తుందో చెప్పాలని కోరారు. ఈ కేసులో సీఎం జగన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేయడం ఖాయమని, అసలు ఇప్పటికే జగన్ కుటుంబానికి నోటీసులు అంది ఉండాలన్నారు.