ప్రభుత్వ అనుబంధ సంస్థలు, జూనియర్ కాలేజీల్లో ఇంటర్ తాజా ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులందరికీ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఇంటర్ విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఉత్తర్వులు జారీచేశారు. మే 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాలేజీల వారీగా ఫెయిలైన విద్యార్థుల వివరాలను గ్రూపుల వారీగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే వారి తల్లిదండ్రులను సంప్రదించి ప్రత్యేక తరగతులకు విద్యార్థులు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. డేస్ కాలర్స్, రెసిడెన్షియల్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ విద్యార్థులకూ వేర్వేరుగా తరగతులు నిర్వహించాలన్నారు. ఆర్జేడీలు, డీవీఈవోలు, ప్రిన్సిపాళ్లు తరగతులను పర్యవేక్షించాలని, ఈ ఉత్తర్వులు ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థలకు మాత్రమే వర్తిస్తాయని, ప్రైవేటు కాలేజీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.