చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి. కొత్తకోట గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో గతేడాది చోరీ జరిగింది. అయితే అనుకోకుండా ఈ విగ్రహాలు మళ్లీ దొరికాయి. పులిచెర్లకు చెందిన శేఖర్, కార్వేటినగరానికి చెందిన సుబ్రహ్మణ్యం గతేడాది పూతలపట్టు మండలం పి.కొత్తకోట వెంటేశ్వరస్వామి ఆలయంలో చోరీ చేశారు. గుడిలో స్వామివారి విగ్రహంతో పాటు శ్రీదేవి, భూదేవి పంచలోహ విగ్రహాలు, కంచు, ఇత్తడి వస్తువులు అపహరించారు.
వీరిద్దరు అక్కడికితో ఆగకుండా మరికొన్ని గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో రాగివైర్లు, ఆయిల్, గ్యాస్ సిలిండర్లు, కంచుబిందెలను చోరీ చేశారు. ఈ వరుస ఘటనలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.. నిఘా పెంచి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి పంచలోహ విగ్రహాలతో పాటు సుమారు రూ.5లక్షలు విలువచేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై మరికొన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆలయంలో చోరీ అయిన విగ్రహాలు.. మళ్లీ ఇలా దొంగల దగ్గర దొరకడంతో వెంకటేశ్వరస్వామి మహిమ అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.