కడప నగర పరిధిలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గురువారం ఓ రోగి మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాలిలా.. మైదుకూరు మండలానికి చెందిన కిరణ్‌కుమార్(32) అనే వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతూ ఈనెల 1వ తేదీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గురువారం కాస్త తేరుకున్నప్పటికీ ఉన్నట్లుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విషయం గమనించిన రోగి బంధువులు ఆసుపత్రి వైద్యులు, నర్సులకు చికిత్స చేయాలని ప్రాఽధేయపడినా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. అందుబాటులో సీనియర్ వైద్యులు లేక జూనియర్ డాక్టర్లు చికిత్సను కొనసాగించడం, రోగి నుంచి సరైన స్పందన లేకపోవడంతో అనస్తీషియా వైద్యులు వచ్చి పరీక్షించి చికిత్స చేసినా ఫలితం లేకపోగా రోగి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణించాడంటూ రోగి బంధువులు ఐసీయూ బయట కాసేపు ఆందోళన చేశారు. దీంతో భయపడిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సర్దుమణిగేలా చేశారు. ఈ విషయమై సర్వజన ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీనివాసులును వివరణ కోరగా.. రోగి చనిపోయిన మాట వాస్తవమని, రోగి బంధువులు కాసేపు ఆందోళన చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానిజాలు తెలుసుకునేందుకు సూపరింటెండెంట్ త్రిసభ్య కమిటీని వేశారు. కమిటీ ఇచ్చే వాస్తవాల ఆధారంగా బాధ్యులు ఎవరైనా ఉంటే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.