అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడుతున్న చంద్రబాబు.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. అమరావతి పేరుతో దోచుకున్నదంతా బయటపడుతుందనే భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు జనంలో తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి అవినీతిపై సుప్రీం కోర్టు 'స్టే'ను ఎత్తేయడంతోపాటు, స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసుల్లో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతోనే చంద్రబాబు జనంలో తిరుగుతున్నారన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన చంద్రబాబును అరెస్ట్ చేయడం ఖాయమన్నారు. అమరావతి పేరుతో దోచుకున్నదంతా బయటపడుతుందనే భయంతోనే జనాల్లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. రైతుకు వ్యవసాయం దండగ అన్నారని, కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అధికారులను అప్రమత్తులుగా చేసి నష్టపోయిన రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారని తెలిపారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రతిరోజు మీటింగ్ లు పెట్టడమేకానీ ప్రజలకు చేసిందేమీ లేదని, సీఎం జగన్ నిర్ణయాలను టీడీపీ నాయకులే మెచ్చుకుంటున్నారని చెప్పారు.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ధాన్యం తీసుకుంటున్నామన్నారు. సిట్ దర్యాప్తు తర్వాత బాబును అరెస్ట్ చేయడం ఖాయమని, అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని మంత్రి ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అవినీతిపై వైసీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే దీనిపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. దీంతో సిట్ యథావిధిగా పనిచేయడానికి ఆటంకాలు తొలగినట్లైంది.