ఎపుడూ పరీక్షా ఫలితాలలో ముందుండే బాలికలు ఈ సారి పదో పరీక్షా ఫలితాలలోనూ పైచెయ్యి సాధించారు. ఇదిలావుంటే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,05,052 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా... వీరిలో 72.26 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. 3,09,245 మంది బాలురు... 2,95,807 మంది బాలికలు పరీక్షలు రాశారు. వీరిలో 69.27 శాతం మంది బాలురు పాస్ అవ్వగా... 75.38 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు.
933 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఉత్తీర్ణతలో పార్వతీపురం మన్యం జిల్లా (87.47 శాతం) తొలిస్థానంలో నిలవగా... చివరి స్థానంలో నంద్యాల జిల్లా (60.39 శాతం) నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత వచ్చింది. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి బొత్స తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ నెల 13 వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ www.results.bse.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు.