టమోటా రైతులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మరోసారి రోడ్డెక్కారు. మంగళవారం గుర్రంకొండలో టమేటా రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పీలేరు నియోజకవర్గంలో పీలేరు, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండలో టమోటా మార్కెట్లున్నాయి. గుర్రంకొండ మార్కెట్ కు రైతులు రోజు వారీ సరాసరి 650 నుంచి 850 టన్నుల మేరకు టమోటాలను తీసుకువస్తారు. మార్కెట్లలో యజమానులు వేలం పాటలే తప్ప ఈనామ్ పద్ధతిని పీలేరు నియోజకవర్గంలో ఎక్కడా చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో తాము ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేసి సాధించిన 4 శాతం కమిషన్ విధానం బోర్డులకే పరిమితమైందన్న ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జాక్ పాట్ విధానాన్ని రద్దు చేయాలని, కూలీ రేట్లు తగ్గించాలని రాస్తారోకోలు చేసి రైతులు డిమాండ్ చేశారు. అయితే కూలి రూ. 3 నుండి ఏకంగా రూ. 6కు పెంచేశారు. ఎరువుల రేట్లు కూడా పెంచి ఇటు ప్రభుత్వం అటు దళారీలు రైతుల నడ్డి విరుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కనీసం తాము పెట్టిన పెట్టుబడులు కూడా రాక, అదనంగా కూలీల ఖర్చులు తమపై పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక్కోసారి కేజీ టమోటాలు 25 పైసలు కూడా పడటం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులు, మార్కెట్ చైర్మన్ రవికుమార్, కార్యదర్శి జగదీష్ జోక్యం చేసుకుని రైతుల డిమాండ్లను నెల లోపు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, రైతులందరూ సహకరించాలని కోరడంతో రైతులు ధర్నా, రాస్తారోకో విరమించారు. ఇది జరిగని పరిస్థితిలో గుర్రంకొండ మార్కెట్ యార్డును మూసివేయాలని రైతులు హెచ్చరించారు.