అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి ఆదుకోవాల్సిందిపోయి నోటికొచ్చినట్టు తిట్టి సమర్థించుకోవడం జగన్‌రెడ్డి మంత్రులకే చెల్లిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రైతుల ఓట్ల కోసం కాళ్లావేళ్లా పడ్డ వైసీపీ నేతలకు నేడు అదే రైతులు ఎర్రిపప్పల్లాగా కనిపించారా అని ప్రశ్నించారు. పైగా ఎర్రిపప్పలంటే బుజ్జినాన్న అని అర్థం అంటూ కొత్త నిర్వచనాలు చెప్పి మరింత దిగజారిపోయారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంగళవారం ప్రారంభమైంది. నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నాలుగేళ్ల కాలంలో పంచభూతాలను దోచుకుని కోట్లు కూడబెట్టి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని ఆరోపించారు. జగన్‌ను సొంత కుటుంబమే వెలివేసిందని, ఇక మిగిలింది రాష్ట్ర ప్రజలవంతని, దుర్మార్గపు ముఖ్యమంత్రిని ప్రజలు సాగనంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారంతా కలిసి రూ. 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క జగన్‌రెడ్డి ఆ అప్పును రూ. 13 లక్షల కోట్లకు తీసుకెళ్లారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల పేరుతో బటన్‌లు నొక్కి రూ.లక్షా 90 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశానని చెప్పుకుంటున్న జగన్ మిగిలిన రూ. 11 లక్షల కోట్లు తాడేపల్లి ప్యాల్‌సకు తరలించారని ఆరోపించారు. దోపిడీ, హత్యా రాజకీయాలకు రాష్ట్రంలో చోటులేదని, రాష్ట్రాభివృద్ధికి పాటుపడే చంద్రబాబునాయుడుకే ఈ సారి ప్రజలు పట్టం కడతారని చెప్పారు. కార్యక్రమంలో నేతలు బొండా ఉమామహేశ్వరరావు, కొమ్మారెడ్డి పట్టాభి, మాజీ మంత్రి దేవినేని ఉమా, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, పీతల సుజాత, కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.