ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నాయుడిపాలెంకు చెందిన నారు చినకొండారెడ్డి (40) తనకున్న ఆరెకరాల భూమిలో మిర్చి, పత్తి సాగుచేస్తున్నాడు. ఏటా పంట చేతికి వచ్చే సమయంలో బోర్లలో నీరు లేకపోవడం, దిగుబడులు తగ్గడంతో మూడేళ్ల నుంచి వరుసగా నష్టాలు వచ్చాయి. ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో మిర్చి, రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసినా నీళ్లు లేక దిగుబడి రాలేదు. ఐదు బోర్లు వేయించినా ఫలితం శూన్యమైంది. ఇప్పటికే ఆయన సుమారు రూ.18లక్షల వరకూ అప్పులు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. వాటిని తీర్చేమార్గం కనిపించక కొద్ది రోజులుగా తీవ్ర మనోవేదనలో ఉన్న చినకొండారెడ్డి సోమవారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై ఎస్‌ఐ వేముల శ్రీహరి మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా, పల్నాడు జిల్లా గురజాలమండలం పులిపాడు గ్రామానికి చెందిన ఉల్లేరు సైదులు (44) తనకున్న ఎకరం పొలంతోపాటు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశాడు. రెండేళ్లుగా దిగుబడి సరిగా రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో సుమారు రూ. 6 లక్షల దాకా అప్పులపాలయ్యాడు. మనోవేదనతో మంగళవారం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.