సాలూరు మండలంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని, సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు ద్వజమెత్తారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ అధ్యక్షతన జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో పలు శాఖల అధికారులు మాట్లాడుతూ తాము చేస్తున్న అభివృద్ధి పనులతో పాటు భవిష్యత్తులో చేయాల్సిన వాటి గూర్చి వివరించారు. ఈ సందర్భంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్)ఏఇ గౌస్ మొహిద్దీన్ చెప్పింది విన్న శివరాంపురం, సంపంగి పాడు, తుండ సర్పంచులు జరజాపు మోహన్, చంద్రయ్య, సీదరపు నూకయ్య, జీగిరాం, ఖరాసువలస, అన్నంరాజు వలస ఎంపీటీసీలు అల్లు సూర అప్పలనాయుడు, అప్పికొండ రమాదేవి, సీదరపు అనూష తదితరులు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరును ప్రశ్నించారు. పలు గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పథకం పేరుతో ఇంటింటికి కుళాయి అంటూ, బాగున్న రోడ్లను తవ్వి, పనులను పూర్తి చేయకుండా అర్ధాంతరంగా విడిచిపెట్టారని, దానితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నార్ల వలస పంచాయతీ నక్కడ వలస ఎగువ వీధికి త్రాగునీరు అందటం లేదని, ఎంపీటీసీ అనూష చెప్పగా, సంపంగి పాడు మథుర గ్రామాల్లో కొన్నింటికి మంచినీరు లేదని సర్పంచ్ చంద్రయ్య అన్నారు. ఈ దశలో కల్పించుకున్న ఎఇ సుమారు 30కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వాటితో పనులు చేపడతామని, దానితో సమస్యలు తీరుతాయన్నారు. కాగా పంచాయతీల వారీగా మంజూరైన నిధుల వివరాలను సభ్యులకు తెలియజెయ్యాలని వైస్ ఎంపీపీ సురేష్ ఆదేశించడంతో పంచాయతీల వారీగా కాకుండా గ్రామాల వారీగా జాబితా ఉందంటూ వాటి వివరాలను చదివి వినిపించారు. అసలు నిధులు ఎప్పుడు మంజూరయ్యావని రాష్ట్ర గ్రంథాలయ శాఖ సభ్యురాలు రెడ్డి పద్మావతి ప్రశ్నించగా గత ఏడాది నవంబరు నెలలో మంజూరైనట్లు ఏఇ బదులివ్వగా సర్పంచ్ మోహన్ తదితరులు ధ్వజమెత్తారు. ప్రజల త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే నిధులు మంజూరై ఏడు నెలలవుతున్నా ప్రజా ప్రతినిధులకు ఎందుకు చెప్పలేదన్నారు. సచివాలయాల ఇంజనీరింగ్ సహాయకులకు చెప్పామని ఎఇ చెప్పగా, స్థానిక ప్రజా ప్రతినిధులకు చెప్పాలి కదా అని పద్మావతి అన్నారు. ఏది ఏమైనా గ్రామీణ నీటి సరఫరా అధికారుల తీరు బాగోలేదని సర్పంచులు, ఎంపీటీసీలు విమర్శించారు.