వైసీపీ ప్రభుత్వంలో బీసీ సబ్‌ప్లాన్ నిధులు రూ.75 వేల కోట్లు దారి మళ్లించి బీసీలకు అన్యాయం చేశారని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బలహీన వర్గాలను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో నాడు ఎన్టీఆర్ టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగించారని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉండేవని, బీసీ సబ్‌ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం వచ్చాక దారి మళ్లించారన్నారు. టీడీపీ హయాంలో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక పది శాతం తగ్గించి 24 శాతానికి కుదించి బీసీలకు అన్యాయం చేసిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు గుర్తింపు లేదని తెలిపారు. అలాగే విద్యకు సంబంధించి టీడీపీ హయంలో విదేశాల్లో చదివించేందుకు బీసీలకు పది లక్షలు ఇచ్చేవారని, దాన్ని కూడా రద్దు చేశారన్నారు. అలాగే బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, స్కిల్ డెవల్‌పమెంటు, ఇలా టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతీది నిర్వీర్యం చేశారని తెలిపారు. ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో బీసీలపై 2500 దాడులు జరిగాయని, 650 తప్పుడు కేసులు నమోదు చేశారని తెలిపారు. చివరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కూడా తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించినట్లు గుర్తు చేశారు. బీసీలంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మేకలబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ, బెస్తసంఘం నాయకుడు రాంప్రసాద్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.