తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ప్రచండ తుఫాన్ ‘మోకా’ ఆదివారం ఉదయానికి పెనుతుఫాన్‌గా బలహీనపడింది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల మధ్య ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్య సిట్టవా సమీపంలో తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 180 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. పెను తుఫాన్ తీరం దాటిన తరువాత సాయంత్రానికి మరింత బలహీనపడిందని పేర్కొంది. తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొందని, నాలుగైదు రోజులపాటు ఎండలు, వడగాడ్పులు ఉంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు.